Saturday, August 22, 2020

ప్రభుత్వ పథకాలు

 ఈమధ్య ప్రభుత్వాలు అంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నాయి. అసలు సంక్షేమం అంటే ఏమిటి? సామాన్య ప్రజలకు తిండి, బట్ట, గూడు అనే మౌలిక అవసరాలు! వీటిని నిజంగా అవసరమైన ప్రజలకు సమకూరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఈమధ్య సంక్షేమం పేరుతో జనానికి ఒక సంతర్పణ లాగా ఓట్ల మీద యావతో ప్రతీ ఒక్క అవసరాలను ఎదో పథకం పేర డబ్బులు లేదా వసతులు వగైరా సమకూరుస్తూ పోవడం వల్ల ఎలాంటి విపరిణామాలు ఏర్పడుతున్నాయో ప్రభుత్వం గమనించడం లేదు. ఒకవిధంగా ప్రజలను  సోమరులుగా మార్చడమే కాకుండా బాధ్యతా రహిత సమాజంగా ఏర్పడడానికి దోహద పడుతుంది. అన్నీ ఉచితంగా లభిస్తుంటే జనం ఇంకేం పని పట్ల శ్రద్ద చూపిస్తారు?  వెనిజులా దేశంలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే! 

దేశంలో ఉత్పాదకత మాటేంటి? జీడీపీ పడిపోవడానికీ, ధరలు పేరగడానికి పరోక్షంగా కారణం కాదా? ఉత్పాదకత లేకుండా కేవలం పథకాల పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంటే మళ్ళీ బొక్కసం నింపుకోవడానికి డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల ధరలు పెంచడం తద్వారా సరకుల రవాణా చార్జీలు విపరీతంగా పెరిగి జనం పై మళ్లీ ఎక్సయిజ్ సుంకాల మోత మోగి వినియోగ వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతుంటే అంతా ఒక విషవలయంగా మారడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో పది రూపాయలు పన్నులు వసూలు చేసినట్లు కాదా? 

కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు జరుపుతున్న ఈ అధికారిక సంతర్పణ క్రతువును ఆపి, నిజమైన సంక్షేమ కార్యక్రమాల వరకు మాత్రమే పరిమితమై, ఉత్పాదకత కు తోడ్పడే పథకాలను రూపొందించి ప్రజలకు ఆదాయ మార్గాలను చూపడమే కాకుండా బాధ్యతయుత సమాజాన్ని ఏర్పర్చడం ఎంతైనా అవసరం!

కొందరికి ఇది నచ్చక పోవచ్చు. నిజమెప్పుడూ చెదుగానే ఉంటుంది.

లేకపోతే అవి సంక్షేమ పథకాలు కావు, ప్రజల ఓట్లకొరకు ప్రభుత్వ డబ్బుతో అధికారికంగా ప్రలోభ పెట్టడమే అవుతుంది. ఇది హర్షణీయం కాదు!

No comments:

Post a Comment