Monday, August 31, 2020

         నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం!!


పనికిరాని బోరు బావులను కూడిపెయ్యడంలో నిర్లక్ష్యం!

ముక్కుపచ్చలారని పసివాళ్ళు పడిపోతే గానీ కళ్ళు తెరువని యంత్రాంగం!

తెగిన విద్యుత్ వైర్లు వేలాడుతుంటే మొర పెట్టుకున్నా పట్టించుకోని నిర్లక్ష్యం!

షాక్ కొట్టి జనం బలైతే తప్ప కదలని యంత్రాంగం!

రోడ్లన్నీ దెబ్బతిని గుంతలు, గోతుల మయమైనా, ప్రమాదకరంగా మారినా అంతులేని నిర్లక్ష్యం!

ప్రమాదాలు జరిగి రక్త తర్పణమైతేగాని కదలని యంత్రాంగం!

ముఖ్యమైన రోడ్ల మధ్య మ్యాన్ హోల్స్ మూతలు లేకున్నా పట్టింపు లేని నిర్లక్ష్యం!

వర్షాలకు, వరదలకు కనపడక అందులో మునిగి జనం చస్తేగాని కదలని యంత్రాంగం!

విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పే ఇంటర్ పరీక్షా ఫలితాలు సక్రమంగా వెల్లడించంలో నిర్లక్ష్యం!

విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి, తల్లిదండ్రులు, జనమంతా గగ్గోలు పెడితేగాని

పట్టించుకోని యంత్రాంగం!!

ఇవి సరిదిద్దుకోలేనటువంటి జఠిలమైన సమస్యలా? కానేకాదు! 

కేవలం నిర్లక్ష్యం! అంతులేని నిర్లక్ష్యం!!

ప్రభుత్వం, అధికారులు, మంత్రులు,

ఇంకా కిందిస్థాయి యంత్రాంగం ఎంతోమంది బలగం, మరెన్నో రకాల వ్యవస్థలు ఉన్నా, ఎవరికీ జనం ప్రాణాలంటే లెక్కలేని తనం!

రకరకాల పన్నులు కట్టి ప్రభుత్వాన్ని పోషించే  జనం మాత్రం మౌనంగా ఈ నిర్లక్ష్యాలకు మూల్యం చెల్లించుకోవాలా?

ఎక్కడుంది లోపం? ఎందుకీ శాపం

 ఇంగ్లీషు తో ద్వందార్థాలు


Rocket ఆకాశం లోకి పంపేదికావచ్చు, 

టెన్నిస్ ఆడేది కావచ్చు 

Cafe  కాఫీ అమ్మే చోటు కావచ్చు 

ఇంటర్నెట్ సెంటరూ కావచ్చు 

School బడి కావచ్చు, 

ఒక వాదన కావచ్చు 

Virus కంప్యూటర్ సాఫ్ట్వెర్ లో దొంగతనంగా ప్రవేశించేది కావచ్చు,

మన శరీరం లో రోగాన్ని కలిగించేది కావచ్చు

Iron ఇస్త్రీ పెట్టె కావచ్చు

ఇనుమూ కావచ్చు 

Court బాడ్మింటన్ లేదా టెన్నిస్ ఆడే కోర్ట్ కావచ్చు,

 న్యాయ స్థానం కావచ్చు

Glass అంటే నీళ్లు తాగేది కావచ్చు, 

అద్దం కావచ్చు

Fan : పంఖా/విసనకర్ర కావచ్చు, అభిమాని కావచ్చు


 చక్కని అనుబందాలతో చక్కని కుటుంబానికి సోపానాలు

మన భారతీయ సంస్కృతి లో వివాహ వ్యవస్థ
కుటంబ వ్యవస్థకు పెట్టింది పేరు. అలాంటి వివాహం ద్వారా ఒక పడుచు జంట ఏకమైనప్పుడు అంత వరకూ ఉన్న కుటుంబంలో కొత్త జీవితాలు ప్రారంభమౌతాయి, కుటుంబ సభ్యులలో కొత్త అనుబందాలు ఏర్పడుతాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సరైన అవగాహనను కలిగి ఉంటె ఎలాంటి సమస్యలు రాకుండా చక్కని వాతావరణం ఏర్పడి సంతోషకరమైన కుటుంబంగా మార్పు ఏర్పడుతుంది. అలాంటి అవగాహన కలిగించేందుకే  ఈ ప్రయత్నం! 
పెళ్ళైన అమ్మాయి ఇలా ఉండాలి (ఉద్యోగం చేస్తున్నా, లేకున్నా)
భర్త కుటుంబ సభ్యులను తన వారిగా భావించుకొని అత్తామామల పట్ల అణకువ, గౌరవం కలిగి, భర్తకు తోడు నీడగా, ఇతరులకు తల్లో నాలుకలా ఉండి అందరి ఆదరాభిమానాలను పొందిన వారి జీవితం  ఆనందదాయకం. చదువుకున్నానని అహంకారం ప్రదర్శించవద్దు, మెట్టినింట్లో వారితోఎంతగా కలిసిపోతే అంత మంచిది. 
పెళ్లయిన అబ్బాయి ఇలా ఉండాలి
అంత వరకూ ముక్కూ మొహం తెలియని అమ్మాయి, తననూ, తన వారిని నమ్ముకొని తన కుటుంబంలో ఒకరిగా ఉండేేందుకు వచ్చిన అమ్మాయి కనుక ఆమెపట్ల నమ్మకం కలిగి ఇతర కుటుంబ సభ్యులతో అమ్మాయి కి ఎలాంటి సమస్యలు రాకుండా చక్కని అనుబంధం ఏర్పడుటకు తోడ్పడాలి, అనురాగం, ఆప్యాయ తలనూ చూపాలి. ఇతర కుటుంబ సభ్యుల తో ఆమె చక్కని సంబంధాలు ఏర్పర్చుకొనేందుకు భర్త వారధి గా నిలవాలి
అత్తామామలు కోడలి పట్ల ఇలా ఉండాలి
కోడలిగా వచ్చిన అమ్మాయి తన కొడుకును తమ నుండి దూరం చేస్తున్నట్లు భావించకుండా, ప్రేమతో స్వంత కూతురు లాగ భావించి, అపార్థాలకు తావివ్వకుండా కలుపుకొని పోవాలి. ఏమైనా సమస్యలు, అపార్థాలు ఏర్పడితే వాటికి కారణాలు ఏమిటో తెలుసుకుని కొడుకు, కొడలుతో కలిసి చర్చించుకొని పరిష్కరించుకోవాలి. పెద్దవారిగా అవసరమయితే చొరవ తీసుకుని వ్యవహరించాలి అంతే గాని సమస్య జటిలం అయ్యేంత వరకు చూసి, తెగేంత వరకూ లాగవద్దు
చివరిగా...  ఉద్యోగాలు చేస్తూ దూరంగా ఉన్నా, లేక ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉన్నా ఈ అనుబందాలను అనుసరించుతూంటె కాపురాలు చక్కగా ఉంటాయి. ఎక్కడ ఉన్నారన్నది కాదు ముఖ్యం, కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలూ పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ fast గా(చురుగ్గా) ఉంటూన్నప్పటికీ, కుటుంబ సభ్యుల తో మాత్రం ఈ అనుబంధాలు కొనసాగించడం తప్పనిసరి! 

Saturday, August 22, 2020

ప్రభుత్వ పథకాలు

 ఈమధ్య ప్రభుత్వాలు అంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నాయి. అసలు సంక్షేమం అంటే ఏమిటి? సామాన్య ప్రజలకు తిండి, బట్ట, గూడు అనే మౌలిక అవసరాలు! వీటిని నిజంగా అవసరమైన ప్రజలకు సమకూరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఈమధ్య సంక్షేమం పేరుతో జనానికి ఒక సంతర్పణ లాగా ఓట్ల మీద యావతో ప్రతీ ఒక్క అవసరాలను ఎదో పథకం పేర డబ్బులు లేదా వసతులు వగైరా సమకూరుస్తూ పోవడం వల్ల ఎలాంటి విపరిణామాలు ఏర్పడుతున్నాయో ప్రభుత్వం గమనించడం లేదు. ఒకవిధంగా ప్రజలను  సోమరులుగా మార్చడమే కాకుండా బాధ్యతా రహిత సమాజంగా ఏర్పడడానికి దోహద పడుతుంది. అన్నీ ఉచితంగా లభిస్తుంటే జనం ఇంకేం పని పట్ల శ్రద్ద చూపిస్తారు?  వెనిజులా దేశంలో జరిగిందేమిటో అందరికీ తెలిసిందే! 

దేశంలో ఉత్పాదకత మాటేంటి? జీడీపీ పడిపోవడానికీ, ధరలు పేరగడానికి పరోక్షంగా కారణం కాదా? ఉత్పాదకత లేకుండా కేవలం పథకాల పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంటే మళ్ళీ బొక్కసం నింపుకోవడానికి డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల ధరలు పెంచడం తద్వారా సరకుల రవాణా చార్జీలు విపరీతంగా పెరిగి జనం పై మళ్లీ ఎక్సయిజ్ సుంకాల మోత మోగి వినియోగ వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతుంటే అంతా ఒక విషవలయంగా మారడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో పది రూపాయలు పన్నులు వసూలు చేసినట్లు కాదా? 

కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు జరుపుతున్న ఈ అధికారిక సంతర్పణ క్రతువును ఆపి, నిజమైన సంక్షేమ కార్యక్రమాల వరకు మాత్రమే పరిమితమై, ఉత్పాదకత కు తోడ్పడే పథకాలను రూపొందించి ప్రజలకు ఆదాయ మార్గాలను చూపడమే కాకుండా బాధ్యతయుత సమాజాన్ని ఏర్పర్చడం ఎంతైనా అవసరం!

కొందరికి ఇది నచ్చక పోవచ్చు. నిజమెప్పుడూ చెదుగానే ఉంటుంది.

లేకపోతే అవి సంక్షేమ పథకాలు కావు, ప్రజల ఓట్లకొరకు ప్రభుత్వ డబ్బుతో అధికారికంగా ప్రలోభ పెట్టడమే అవుతుంది. ఇది హర్షణీయం కాదు!